A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 05 July 2026, 6:35 am Posted by : A2TV NEWS

పిల్లల ఆరోగ్య భద్రత మనందరి కర్తవ్యం

సంక్షేమ పాఠశాలలు, వసతిగృహాలు స్వచ్ఛతకు నిలయాలుగా మారాలి: అదనపు కలెక్టర్ నగేష్

A2న్యూస్, జులై 5, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ (4) జిల్లాలోని రెసిడెన్షియల్ విద్యాసంస్థలు, సాంఘిక సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థులకు అందిస్తున్న వసతి, ఆహార భద్రత (ఫుడ్ సేఫ్టీ), పరిశుభ్రత, తాగునీరు, పారిశుద్ధ్యం, ఆరోగ్య పరిరక్షణ తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ శనివారం తన ఛాంబర్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ, “పిల్లల ఆరోగ్య భద్రత మనందరి కర్తవ్యం” అని పేర్కొన్నారు. జిల్లాలోని సంక్షేమ పాఠశాలలు, వసతిగృహాల నిర్వహణలో ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన, పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలని సూచించారు. వంటశాలలు, డైనింగ్ హాళ్లు, స్టోర్‌రూమ్‌లు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, వంటకు ఉపయోగించే ఆహార పదార్థాల నాణ్యతను నిరంతరం తనిఖీ చేయాలని తెలిపారు. విద్యార్థులకు సురక్షితమైన తాగునీరు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, హాస్టల్ గదుల్లో తగిన సౌకర్యాలు కల్పించడంతో పాటు ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. ఆహార తయారీ, నిల్వ, పంపిణీ ప్రక్రియల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా చూడాలని స్పష్టం చేశారు.రెసిడెన్షియల్ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లను ప్రత్యేక అధికారులు క్రమం తప్పకుండా సందర్శించి వసతి, ఆహార నాణ్యత, పరిశుభ్రత, భద్రత అంశాలను పరిశీలించి నివేదికలు సమర్పించాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్వో అంబదాస్ రాజేశ్వర్, డీపీవో యాదయ్య, డీఈవో రాజు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గణేశ్వర్, జిల్లా స్థాయి అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, రెసిడెన్షియల్ విద్యాసంస్థల ప్రతినిధులు, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.