A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 14 August 2026, 7:00 am Posted by : A2TV NEWS

ప్రేమ పేరుతో వేధిస్తే జైలుకే!” “నిందితుడికి 2 ఏళ్ల జైలు..20 వేల జరిమానా”

A2న్యూస్, ఆగస్టు (14) మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్‌ జిల్లా (13) పదో తరగతి చదువుతున్న బాలికను ప్రేమించాలంటూ వెంటపడి వేధించిన నిందితుడికి జిల్లా ఫాస్ట్‌ట్రాక్‌ పోక్సో కోర్టు రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధించింది. వెల్దుర్తి మండలానికి చెందిన 27 ఏళ్ల నరేష్‌ పదో తరగతి చదువుతున్న బాలికను ప్రేమించాలంటూ కొంతకాలంగా వెంటపడుతూ వేధింపులకు గురిచేశాడు. దీంతో బాలిక కుటుంబ సభ్యులు వెల్దుర్తి పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ మధుసూదన్‌ గౌడ్‌ 2022 జూలైలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో కీలకమైన సాక్ష్యాధారాలను సేకరించి కోర్టులో సమర్పించారు. విచారణ సందర్భంగా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ బాలయ్య బలమైన వాదనలు వినిపించగా, లీగల్‌ అడ్వైజర్‌ శ్వేత బాధిత బాలిక సాక్ష్యం చెప్పడంలో సహకరించారు. పోలీసులు సమర్పించిన ఆధారాలు, ఇరుపక్షాల వాదనలు పరిశీలించిన జిల్లా ఫాస్ట్‌ట్రాక్‌ పోక్సో కోర్టు న్యాయమూర్తి ఆర్‌.ఎం. సుభావాలి నిందితుడు నరేష్‌కు రెండేళ్ల జైలు 20 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని మెదక్‌ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఐపీఎస్‌ అభినందించారు. ఈ కేసులో లైజనింగ్‌ అధికారులు ఎస్‌ఐ విఠల్‌, కానిస్టేబుల్‌ కృష్ణగౌడ్‌, సీడీఓ ప్రవీణ్‌ సహకరించినట్లు ఎస్పీ తెలిపారు. బాలికలు, మహిళలను వేధించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. బాధితులు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా వేధింపులు ఎదురైతే వెంటనే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు.