A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 11 September 2026, 6:31 am Posted by : A2TV NEWS

సామరస్యంతో సంతోషంగా వినాయక చవితి వేడుకలు

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం: కలెక్టర్ ప్రతిమా సింగ్

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 11:

మెదక్ జిల్లా (10) వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లాలో వేడుకలను ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల భవనంలోని సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, డీఆర్వో అంబదాస్ రాజేశ్వర్, మెదక్ ఆర్డీవో రమాదేవి, తూప్రాన్ ఆర్డీవో బావయ్యలతో కలిసి వినాయక చవితి వేడుకల నిర్వహణపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గణేష్ మండపాల ఏర్పాటు, విద్యుత్ సరఫరా, పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారులు తదితర మౌలిక సదుపాయాల విషయంలో అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. విగ్రహ ప్రతిష్ఠాపన నుంచి నిమజ్జనం వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. నిమజ్జన కార్యక్రమం సజావుగా జరిగేలా ముందస్తు ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి వినాయక చవితి వేడుకలను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ కోరారు.

నిబంధనలు పాటిస్తూ వేడుకలు నిర్వహించాలి

జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ గణేష్ మండపాల నిర్వాహకులు నిబంధనలు పాటిస్తూ పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా వేడుకలను ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు. సమావేశం అనంతరం జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు జిల్లా అధికారులకు మట్టి వినాయక ప్రతిమలను అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు పర్యావరణహితమైన మట్టి వినాయక విగ్రహాలను మాత్రమే ప్రతిష్ఠించాలని సూచించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను వినియోగించకుండా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేయడం వల్ల చెరువులు, నదులు, ఇతర జల వనరులు కలుషితమయ్యే అవకాశం ఉందని తెలిపారు. మట్టి వినాయక విగ్రహాలను వినియోగించడం ద్వారా జల వనరులను పరిరక్షించడంతో పాటు పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్, రెవెన్యూ, గ్రామపంచాయతీ, విద్యుత్, ఫైర్, ఆర్‌అండ్‌బీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.