A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 15 June 2026, 5:04 pm Posted by : A2TV NEWS

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

A2 న్యూస్, జూన్ 15, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యమని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 82 దరఖాస్తులను స్వీకరించి, వాటి పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్ చేసినట్లు తెలిపారు.

ప్రజలు అందజేసిన వినతులు, ఫిర్యాదులను జాప్యం చేయకుండా సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి దరఖాస్తును అధికారులు వ్యక్తిగతంగా పరిశీలించి, సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సూచించారు. వచ్చే సోమవారం నాటికి అందిన ప్రతి దరఖాస్తును పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అందిన ప్రతి దరఖాస్తును ప్రజావాణి పోర్టల్‌లో నమోదు చేయాలని, దరఖాస్తుదారులకు రశీదు అందజేయాలని కలెక్టర్ సూచించారు. దీంతో సమస్యల పరిష్కార ప్రక్రియలో పారదర్శకత నెలకొంటుందని తెలిపారు. అలాగే, దరఖాస్తులపై ఆయా శాఖల అధికారులు చేపట్టిన చర్యల వివరాలను కూడా పోర్టల్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. ప్రజావాణి ద్వారా అందిన ప్రతి దరఖాస్తును అత్యంత ప్రాధాన్యంతో తీసుకుని, నిర్దిష్ట కాలవ్యవధిలో పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం లేదా జాప్యం జరిగితే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, డీఆర్‌ఓ అంబదాస్ రాజేశ్వర్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.