A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 22 September 2026, 5:59 am Posted by : A2TV NEWS

భక్తిశ్రద్ధలతో గణేష్ నిమజ్జన కార్యక్రమం

జిల్లా పోలీస్ కార్యాలయంలో గణనాథునికి ప్రత్యేక పూజలు

29 వేలతో గణపతి లడ్డూను సొంతం చేసుకున్న హెడ్ కానిస్టేబుల్ శంకర్

మరో లడ్డూను 5,500కు దక్కించుకున్న హెడ్ కానిస్టేబుల్ జాఫర్

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 22:

మెదక్ జిల్లా (21) గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతిష్ఠించిన గణపతి విగ్రహానికి సోమవారం జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన పూజా కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. విఘ్నేశ్వరుడు ప్రజలందరికీ సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలను ప్రసాదించాలని, ప్రజలు, పోలీస్ అధికారులు, సిబ్బంది చేపట్టే ప్రతి కార్యం ఎలాంటి విఘ్నాలు లేకుండా విజయవంతంగా పూర్తయ్యేలా ఆశీర్వదించాలని మహాగణపతిని ప్రార్థించినట్లు తెలిపారు.

అనంతరం గణపతి లడ్డూ వేలంపాట నిర్వహించారు. ఈ వేలంలో హెడ్ కానిస్టేబుల్ శంకర్ రూ.29,000లకు గణపతి లడ్డూను సొంతం చేసుకున్నారు. మరో లడ్డూను హెడ్ కానిస్టేబుల్ జాఫర్ రూ.5,500లకు దక్కించుకున్నారు. గత ఏడు రోజులుగా విశేష పూజలు అందుకున్న గణనాథుని నిమజ్జన కార్యక్రమంలో భాగంగా ఎస్పీ శోభాయాత్రను ప్రారంభించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు, మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా శోభాయాత్రలో పాల్గొన్నారు. డప్పు వాయిద్యాల నడుమ కోలాటాలు, ఆటపాటలతో గణనాథునికి భక్తిశ్రద్ధలతో వీడ్కోలు పలికారు.

గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించడంలో సహకరించిన పోలీస్ అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులను ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, సీఐ సందీప్ రెడ్డి, ఆర్‌ఐ శైలేందర్‌తో పాటు పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.