A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 14 August 2026, 7:17 am Posted by : A2TV NEWS

ఆరుతడి పంటలపై దృష్టి సారించాలి

— జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

A2న్యూస్, ఆగస్టు (14) మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్ జిల్లా (13) రైతులు ఆరుతడి, ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించేలా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. గురువారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లా వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులతో గూగుల్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో సాగవుతున్న పంటల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు సూచిస్తున్న నేపథ్యంలో రైతులను అప్రమత్తం చేయాలన్నారు. వరి పంటకు అధికంగా నీరు అవసరమవుతుందని, వర్షాలు తగ్గితే వరి పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందన్నారు. దీంతో దిగుబడి తగ్గి రైతులు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో రైతులు ఆరుతడి, ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లేలా గ్రామస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. గ్రామ సర్పంచులు, రైతులతో సమావేశాలు నిర్వహించి తక్కువ నీటితో సాగు చేయగల పంటలపై అవగాహన కల్పించాలని సూచించారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికతో రైతులకు అవసరమైన సూచనలు, సలహాలు అందించాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్‌తో పాటు వ్యవసాయ విస్తరణ అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.