అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 3:
శివంపేట (2) ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ ఐ ఆర్)లో భాగంగా చేపట్టిన వ్యక్తిగత విచారణ (హియరింగ్) ప్రక్రియను ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. శివంపేట మండలం కొత్తపేట గ్రామంలో ఎస్ ఐ ఆర్ కు సంబంధించి ఓటరు జాబితాలో గుర్తించిన తప్పుల సవరణ కోసం జారీ చేసిన నోటీసులపై జరుగుతున్న విచారణ ప్రక్రియను కలెక్టర్ ప్రతిమా సింగ్ పరిశీలించారు. నర్సాపూర్ ఆర్డీఓ రామకృష్ణ, తహసీల్దార్ కమలాద్రితో కలిసి ఆమె హియరింగ్ కేసుల పరిశీలన చేపట్టారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో భాగంగా ఓటరు జాబితాలో గుర్తించిన తప్పుల సవరణకు జారీ చేసిన నోటీసులపై విచారణ, బి ఎల్ ఓ యాప్‌లో వివరాల నమోదు,ఏ ఈ ఆర్ ఓ లాగిన్‌కు పంపే విధానం, అనంతరం ఏ ఈ ఆర్ ఓ లాగిన్‌లో ధ్రువీకరణ చేసే ప్రక్రియను పరిశీలించినట్లు తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరి ఓటు ఓటరు జాబితాలో నమోదై ఉండేలా చూడాలని, అనర్హులైన ఓట్లను నిబంధనల ప్రకారం తొలగించాలని అధికారులకు సూచించారు. (ఎస్ ఐ ఆర్) ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పూర్తి ఖచ్చితత్వంతో నిర్వహించాలని ఆదేశించారు. కొత్తపేట గ్రామానికి సంబంధించి పేరు, వయస్సులో పొరపాట్లు తదితర 187 అనామలీస్‌తో పాటు, 2002 సంవత్సరానికి సంబంధించిన ఓటరు లేదా వారి పూర్వీకుల పేర్లతో అనుసంధానం చేయలేకపోవడం వంటి అంశాలతో కలిపి మొత్తం 227 తప్పులను గుర్తించినట్లు కలెక్టర్ తెలిపారు. ఇప్పటివరకు 78 మంది సంబంధిత పత్రాలను సమర్పించగా, వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శివప్రసాద్, సంబంధిత రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.