A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 27 August 2026, 7:40 am Posted by : A2TV NEWS

అర్హులైన ప్రతి ఒక్కరూ చేయూత పెన్షన్‌కు దరఖాస్తు చేసుకోవాలి

బహుభాషల్లో ఆడియో, వీడియోలు, పాటలతో విస్తృత అవగాహన ప్రచారం: జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 27:

మెదక్ జిల్లా (26) తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న చేయూత సామాజిక భద్రతా పెన్షన్లకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 31వ తేదీ వరకు అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. గడువు సమీపిస్తున్న నేపథ్యంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. సామాజిక భద్రతతో పాటు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హత ఉన్నప్పటికీ సమాచారం లేకపోవడం లేదా దరఖాస్తు చేయకపోవడం వల్ల ఎవరూ ఈ పథకం ప్రయోజనానికి దూరం కాకూడదనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు సెర్ప్ (SERP) ఆధ్వర్యంలో తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లో చేయూత పెన్షన్లపై అవగాహన కల్పించే ఆడియోలు, వీడియోలు, పాటలను రూపొందించి విడుదల చేసినట్లు తెలిపారు. స్థానిక భాష, యాస, జీవన విధానానికి అనుగుణంగా రూపొందించిన ఈ ప్రచార సామగ్రి ద్వారా అర్హతలు, దరఖాస్తు విధానం, చివరి తేదీ తదితర అంశాలను ప్రజలకు సులభంగా చేరవేస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లోనూ అర్హులైన వారందరికీ సమాచారం చేరేలా మీడియా, సామాజిక మాధ్యమాలు, స్థానిక ప్రచార కార్యక్రమాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, గ్రామస్థాయి సిబ్బంది ఈ ప్రచారంలో భాగస్వాములై అర్హులైన వారిని గుర్తించి దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. ఈ నెల 31వ తేదీతో దరఖాస్తు గడువు ముగియనున్నందున, చివరి రోజు వరకు వేచి ఉండకుండా అర్హులైన ప్రతి ఒక్కరూ వెంటనే దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ విజ్ఞప్తి చేశారు.