A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 26 August 2026, 6:15 am Posted by : A2TV NEWS

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

పచ్చదనం పెంపొందించి పర్యావరణ సమతుల్యతను కాపాడాలి

మొక్కల సంరక్షణతోనే పచ్చని భవిష్యత్తు సాధ్యం: కలెక్టర్ ప్రతిమా సింగ్

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 26 :

మెదక్ జిల్లా (25) పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపునిచ్చారు. మొక్కలను నాటి వాటిని వృక్షాలుగా ఎదిగే వరకు సంరక్షించినప్పుడే పచ్చని భవిష్యత్తుకు బాటలు వేయగలమని ఆమె పేర్కొన్నారు. వన మహోత్సవం సందర్భంగా మంగళవారం మెదక్ జిల్లా కేంద్రంలోని మహిళా డిగ్రీ కళాశాల ఆవరణలో డీఎఫ్‌ఓ జి.జి., కళాశాల అధ్యాపకులు, విద్యార్థినులతో కలిసి కలెక్టర్ ప్రతిమా సింగ్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వన మహోత్సవం కింద మెదక్ జిల్లాలో 31 లక్షల 95 వేల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటివరకు 19 లక్షల 43 వేల 654 మొక్కలు నాటి 60.83 శాతం లక్ష్యాన్ని సాధించినట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో మొక్కలు, అడవులు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు. పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించడంతోపాటు వాతావరణ సమతుల్యతను కాపాడేందుకు పచ్చదనాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. వన మహోత్సవాన్ని కేవలం మొక్కలు నాటే కార్యక్రమంగా కాకుండా ప్రకృతిని పరిరక్షించే సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ భావించాలని సూచించారు. భావితరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. నాటిన ప్రతి మొక్కను కాపాడినప్పుడే వన మహోత్సవ లక్ష్యం నెరవేరుతుందని, పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు బాటలు వేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపల్ ప్రవీణ్ కుమార్, అధ్యాపకులు, విద్యార్థినులు, అటవీ శాఖ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.