A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 19 October 2026, 7:21 am Posted by : A2TV NEWS

ఎల్‌నినో ప్రభావంతో నీటి ఎద్దడి ముప్పు.. వరి సాగు తగ్గించాలి

ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి: కలెక్టర్ ప్రతిమా సింగ్

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) అక్టోబర్ 19 :

మెదక్ జిల్లా (18) ఎల్‌నినో ప్రభావంతో నీటి ఎద్దడి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున, 2026–27 యాసంగి సీజన్‌లో వరి సాగును తగ్గించి, తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్ నుంచి విడుదల చేసిన ప్రకటనలో పంటల సాగు ప్రణాళికపై పలు సూచనలు చేశారు. జిల్లాలో నీటి లభ్యత, భూగర్భ జలాల పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని పంటల సాగు ప్రణాళిక రూపొందించాలని సూచించారు. శనగ, వేరుశనగ, పొద్దుతిరుగుడు, కుసుమ, పప్పుధాన్యాలు వంటి ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. భూగర్భ జలాల పరిరక్షణకు వాల్టా చట్ట నిబంధనలు అమలు చేయాలని, నీటి వనరులు పరిమితంగా ఉన్న గ్రామాల్లో వరి సాగును తగ్గించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. రైతులకు అవసరమైన విత్తనాలను ముందుగానే అందుబాటులో ఉంచడంతో పాటు, నకిలీ విత్తనాలు, ఎరువుల అక్రమ విక్రయాలను అరికట్టేందుకు నిరంతర తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. డ్రిప్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ సేద్య పద్ధతులను ప్రోత్సహించాలని సూచించారు. ప్రత్యామ్నాయ పంటలకు గిట్టుబాటు ధర, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించేందుకు కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. రైతు వేదికల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, పంటల మార్పిడిని ప్రోత్సహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. నీటి వనరులను పరిరక్షిస్తూ, రైతులకు మెరుగైన ఆదాయం అందేలా వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.