A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 29 July 2026, 6:27 am Posted by : A2TV NEWS

కౌడిపల్లి పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు

రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలి

సీసీ కెమెరాలతో నేరాలపై నిఘా పెంచాలి

ప్రతిరోజూ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించాలి

పెండింగ్‌ కేసుల పరిష్కారం వేగవంతం చేయాలి

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) జూలై 29:

కౌడిపల్లి (28) ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించడంతో పాటు పెండింగ్‌లో ఉన్న కేసులను వేగంగా పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం కౌడిపల్లి పోలీస్‌స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి స్టేషన్‌ నిర్వహణ, రికార్డులు, పెండింగ్‌ కేసులు, నేర నియంత్రణ చర్యలు, సిబ్బంది విధి నిర్వహణ, స్టేషన్‌ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పెండింగ్‌ కేసుల పురోగతిని సమీక్షించిన ఎస్పీ, వాటి దర్యాప్తును వేగవంతం చేసి త్వరితగతిన పరిష్కరించాలని కౌడిపల్లి ఎస్‌ఐ అమర్‌కు సూచించారు. కేసుల విచారణలో నిర్లక్ష్యానికి తావులేకుండా సమయపాలనతో విధులు నిర్వహించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించిన ఎస్పీ, ప్రతిరోజూ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ముఖ్యంగా 765డీ జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. వాహనదారులకు ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కల్పించడంతో పాటు అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి ఉల్లంఘనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. స్టేషన్‌ పరిధిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును పరిశీలించిన ఎస్పీ, ప్రధాన కూడళ్లు, వ్యాపార ప్రాంతాలు, ఇతర కీలక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నేరాల నియంత్రణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగిస్తూ నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ వారి ఫిర్యాదులను వెంటనే స్వీకరించి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఎస్పీ సూచించారు. అనంతరం పోలీసు సిబ్బందితో సమావేశమైన ఆయన విధి నిర్వహణలో క్రమశిక్షణ పాటిస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ తనిఖీలో ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్‌ సందీప్‌రెడ్డి, నర్సాపూర్ సీఐ రంగా కృష్ణ, కౌడిపల్లి ఎస్‌ఐ అమర్‌ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.