A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 30 July 2026, 6:15 am Posted by : A2TV NEWS

మెదక్ జిల్లాలో 90 శాతం ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తి..

త్వరలో వంద శాతం పూర్తి కానున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియ: జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) జూలై 30:

మెదక్ జిల్లా (29) మెదక్ జిల్లాలో ప్రత్యేక సారాంశ సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని, ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ఇప్పటికే 90 శాతం పూర్తయిందని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. మరో రెండు నుంచి మూడు రోజుల్లో వంద శాతం డిజిటలైజేషన్ పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియ పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో మొత్తం 4,53,140 మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను వంద శాతం పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు అందిన ఫారాలలో 90 శాతం డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేసినట్లు వివరించారు. జిల్లాలో పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్ ప్రక్రియను కూడా చేపడుతున్నామని తెలిపారు. ఒకే పోలింగ్ కేంద్ర పరిధిలో 1,200 మందికి పైగా ఓటర్లు ఉన్న కేంద్రాలు, అలాగే 2 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న పోలింగ్ కేంద్రాలను గుర్తించి అవసరమైన మార్పులు చేపడుతున్నట్లు వెల్లడించారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు మరో నాలుగు నుంచి ఐదు రోజుల గడువు మాత్రమే మిగిలి ఉందన్నారు. అందువల్ల పనులను వేగవంతంగా పూర్తి చేయడంతో పాటు ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఈఆర్‌వోలు ర్యాండమ్ తనిఖీలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్డీఓ రమాదేవి, సెక్షన్ సూపరింటెండెంట్ గఫార్, తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.