A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 06 September 2026, 6:36 am Posted by : A2TV NEWS

ఆపదలో ఉన్నవారికి అండగా డయల్‌ 112

సైబర్‌ నేరాలు, డ్రగ్స్‌పై గ్రామస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలి

సీసీ కెమెరాలు, బీట్‌ వ్యవస్థను బలోపేతం చేయాలి

చిలిపిచ్చేడ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎస్పీ వార్షిక తనిఖీ

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 6:

చిలిపిచ్చేడ్‌ (5) పోలీస్‌ స్టేషన్‌లలో సమర్థవంతమైన పోలీసింగ్‌తో పాటు రికార్డుల నిర్వహణ, పెండింగ్‌ కేసుల దర్యాప్తుపై ప్రత్యేక దృష్టి సారించాలని మెదక్‌ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శనివారం చిలిపిచ్చేడ్‌ పోలీస్‌ స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో మొక్కను నాటిన ఎస్పీ, అనంతరం పోలీస్‌ సిబ్బంది కిట్‌ను పరిశీలించారు. స్టేషన్‌ నిర్వహణ, నేరాల దర్యాప్తు, సిబ్బంది పనితీరు, రికార్డుల నిర్వహణ, పెండింగ్‌ కేసుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఎఫ్‌ఐఆర్‌ల నమోదు, స్టేషన్‌ డైరీలు, రౌడీషీట్లు, సస్పెక్ట్‌ షీట్లు, బీట్‌ బుక్స్‌, సీజ్‌ ప్రాపర్టీ రికార్డులు, వారెంట్ల అమలు, సీసీటీఎన్‌ఎస్‌, ఈ-సాక్ష్య నమోదు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీస్‌ స్టేషన్‌లో ఎలాంటి పెండెన్సీ లేకుండా రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించి పకడ్బందీగా నిర్వహించాలని ఎస్పీ ఆదేశించారు. బాధితులకు సత్వర న్యాయం అందేలా నాణ్యమైన, పారదర్శకమైన దర్యాప్తు చేపట్టాలని సూచించారు. స్టేషన్‌కు వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, వారి సమస్యలను ఓర్పుతో విని చట్టపరమైన సహాయం అందించాలని సిబ్బందికి సూచించారు. సైబర్‌ నేరాలు, మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై గ్రామస్థాయిలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఎస్పీ సూచించారు. ప్రతి గ్రామంపై విలేజ్‌ పోలీస్‌ ఆఫీసర్లకు పూర్తి అవగాహన ఉండాలని, గ్రామస్థాయిలో పోలీసింగ్‌ను మరింత పటిష్టం చేయాలని ఆదేశించారు. దుకాణాలు, వ్యాపార సంస్థలు, ప్రధాన కూడళ్ల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటును ప్రోత్సహించాలని తెలిపారు. రౌడీషీటర్లు, సస్పెక్ట్‌ల కదలికలపై నిరంతరం నిఘా ఉంచడంతో పాటు బీట్‌ వ్యవస్థను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు, కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ నేరాల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

సిబ్బందికి సూచనలు

అనంతరం పోలీస్‌ స్టేషన్‌ సిబ్బందితో ఎస్పీ సమావేశమై విధుల నిర్వహణపై పలు సూచనలు చేశారు. క్రమశిక్షణ, అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. సిబ్బంది విధులకు సంబంధించిన అంశాలతో పాటు వారి వ్యక్తిగత సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నారు. అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు.

అత్యవసర వేళ 112కు సమాచారం

అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా వెంటనే డయల్‌ 112కు సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు. ఆపదలో ఉన్నవారికి తక్షణ పోలీస్‌ సహాయం అందేలా 112 సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ తనిఖీలో డీఎస్పీ నరేందర్‌ గౌడ్‌, సీఐలు సందీప్‌రెడ్డి, రంగా కృష్ణ, ఎస్‌ఐ నర్సింలు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.