రాత్రివేళల్లో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి ఎస్పీ ఆదేశం
పాయింట్ బుక్‌లను తనిఖీ చేసిన ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 17:
మెదక్ జిల్లా (16) గణేష్ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపట్టాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు పోలీసు అధికారులను ఆదేశించారు. బుధవారం మెదక్ పట్టణంలోని పలు గణేష్ మండపాలను ఆయన సందర్శించి, బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రతి గణేష్ మండపం వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది పాయింట్ బుక్‌లను ఎస్పీ తనిఖీ చేశారు. విధుల్లో భాగంగా సిబ్బంది నమోదు చేస్తున్న వివరాలను పరిశీలించి, విధుల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మండపాల వద్దకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాత్రివేళల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, అనుమానాస్పద వ్యక్తులు, వస్తువుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు. మండపాల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కూడా ఎస్పీ పరిశీలించారు. కెమెరాలు నిరంతరం పనిచేసేలా చూడడంతో పాటు, అవసరమైన ప్రాంతాలను పూర్తిగా కవర్ చేసే విధంగా నిఘా వ్యవస్థను పటిష్ఠం చేయాలని ఆదేశించారు. గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు మండపాల నిర్వాహకులు, ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసు అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్న కుమార్, సీఐలు మహేష్, సందీప్ రెడ్డి, కృష్ణమూర్తితో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.