A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 26 June 2026, 6:27 am Posted by : A2TV NEWS

ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణలో పూర్తి వివరాలు నమోదు చేయాలి – జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

A2 న్యూస్, జూన్ 26, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

నర్సాపూర్ 25: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితాల సవరణ కార్యక్రమం (ఎస్‌ఐఆర్–2026)లో ప్రతి ఓటరు పూర్తి వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధితో పాటు నర్సాపూర్ మండలంలోని అచ్చంపేట గ్రామంలో నిర్వహిస్తున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్–2026) ప్రక్రియను ఆర్డీవో, తహసీల్దార్‌లతో కలిసి కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌వోలు) ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, తిరిగి సేకరణ, వివరాల నమోదు వంటి అంశాల్లో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పారదర్శకంగా ప్రక్రియను నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి అర్హత కలిగిన పౌరుడు ఓటరు జాబితాలో తన పేరు నమోదు చేసుకోవడం ప్రజాస్వామ్య బాధ్యత అని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం ద్వారా ఓటరు జాబితాలను మరింత పారదర్శకంగా, ఖచ్చితంగా రూపొందిస్తున్నామని తెలిపారు.18 సంవత్సరాలు నిండిన ప్రతి యువకుడు, యువతి తప్పనిసరిగా ఓటరుగా నమోదు కావాలని, చిరునామా మార్పులు, పేరు సవరణలు, ఇతర వివరాల నవీకరణ కోసం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని, ఎన్నికల ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని బలోపేతం చేయడంలో ఖచ్చితమైన ఓటరు జాబితా కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. నేటి నుంచి బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేస్తారని, ప్రజలు సరైన వివరాలను అందించి కార్యక్రమానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ తహసీల్దార్ శ్రీనివాస్, బీఎల్‌వోలు, ఎస్‌ఐఆర్ సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.