వర్షాలకు తడిసి నేలమట్టమైన ఇల్లు – ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడి వేడుకోలు
A2న్యూస్, తూప్రాన్/ మనోహరాబాద్ ప్రతినిధి (జల్లి రామకృష్ణ) సెప్టెంబర్ 28:
తూప్రాన్ (27) ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తూప్రాన్లోని అంబేద్కర్నగర్ కాలనీలో ఓ ఇల్లు కూలిపోయింది. ఆదివారం ఉదయం సుమారు 10:30 గంటల సమయంలో ఇల్లు ఒక్కసారిగా కూలిపోవడంతో స్థానికంగా కలకలం రేగింది. బాధితుడు కాలకంటి సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. వర్షాలకు ఇంటి పెచ్చులు ఊడిపడి, ఇల్లు ఎప్పుడు కూలుతుందో తెలియని ప్రమాదకర పరిస్థితి ఏర్పడింది. దీంతో ముందుగానే ఇల్లు ఖాళీ చేసి అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నట్లు తెలిపారు. అయితే ఆయన తల్లి అదే ఇంట్లో ఉంటుండగా, ఆదివారం ఆమె ఊరికి వెళ్లిన సమయంలో వర్షాలకు తడిసిన ఇల్లు పూర్తిగా కూలిపోయిందని చెప్పారు. ఇల్లు కూలిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని సత్యనారాయణ తెలిపారు. ఇల్లు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, ప్రభుత్వ సహాయంతో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.