A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 27 September 2026, 6:49 am Posted by : A2TV NEWS

ప్రపంచంలోనే అరుదైన పథకం సీఎం బ్రేక్‌ఫాస్ట్

నాణ్యమైన, పౌష్టికాహారం అందించడమే లక్ష్యం: మంత్రి వివేక్ వెంకటస్వామి

 

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 27:

మెదక్ జిల్లా (26) విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్యమంత్రి బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రపంచంలోనే అరుదైన కార్యక్రమమని ఉపాధి, కార్మిక, గనుల భూగర్భ శాఖ మంత్రి, మెదక్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. శనివారం మెదక్ పట్టణంలోని మార్కెట్ యార్డులో నూతనంగా నిర్మించిన కేంద్రీకృత వంటశాలను మంత్రి వివేక్ వెంకటస్వామి, మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్‌రావు, జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్తో కలిసి ప్రారంభించారు. అనంతరం కేంద్రీకృత వంటశాలలోని యంత్రాలు, వంట సామగ్రిని పరిశీలించి వాటి సామర్థ్యం, పనితీరును సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మెదక్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారం వడ్డించారు. విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసిన మంత్రి, భోజనం నాణ్యత, రుచిపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికరమైన అల్పాహారం అందించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమన్నారు. హరేకృష్ణ మూవ్‌మెంట్ బృందానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. ప్రతిరోజూ ఉదయం 8:30 గంటలకు పాఠశాలలకు అల్పాహారం చేరేలా ఏర్పాట్లు చేశామని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 36 కేంద్రీకృత వంటశాలలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి బ్రేక్‌ఫాస్ట్ పథకం అమలుతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందన్నారు. ఇప్పటికే 10 వేల మంది ఉపాధ్యాయులను నియమించామని తెలిపారు. మెదక్‌లో యంగ్ ఇండియా స్కూల్‌ను వచ్చే విద్యా సంవత్సరం నుంచి 2,500 మంది విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి వెల్లడించారు. మెదక్‌కు రూ.100 కోట్ల వ్యయంతో పబ్లిక్ స్కూల్ కూడా మంజూరైందన్నారు. రాష్ట్రంలో 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు అల్పాహార పథకాన్ని విస్తరించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నామని చెప్పారు. టెక్నాలజీ అభివృద్ధి కోసం నూతనంగా ఏటీసీ కేంద్రాన్ని ప్రారంభించామని, అక్కడ శిక్షణ పొందిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.

విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి

మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్‌రావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి బ్రేక్‌ఫాస్ట్ పథకం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారం అందిస్తూ ప్రభుత్వం విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. మెదక్‌లో యంగ్ ఇండియా స్కూల్‌ను ప్రారంభించడం ద్వారా స్థానిక విద్యార్థుల భవిష్యత్తును మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.  హరేకృష్ణ మూవ్‌మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ ( హెచ్ కె ఎం సి ఎఫ్) అధ్యక్షుడు, అక్షయపాత్ర ఫౌండేషన్ (తెలంగాణ & ఆంధ్రప్రదేశ్) ప్రాంతీయ అధ్యక్షుడు హిస్ గ్రేస్ శ్రీ సత్య గౌర చంద్ర దాస (ఎం.టెక్., ఐఐటీ మద్రాస్) మాట్లాడుతూ.. మెదక్ జిల్లాలో సుమారు 30 వేల మంది విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకుని ఈ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో తొలి కేంద్రీకృత వంటశాలను కొడంగల్‌లో ప్రారంభించామని, అక్కడి అనుభవాన్ని ఆధారంగా చేసుకుని రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని విస్తరిస్తున్నామని తెలిపారు.ఈ పథకం అమలుతో కొడంగల్ పరిసర ప్రాంతాల్లోని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య సుమారు 20 శాతం పెరిగినట్లు తెలిపారు. మెదక్‌లో కేంద్రీకృత వంటశాల నిర్మాణాన్ని కేవలం 40 రోజుల్లో పూర్తి చేసినట్లు వెల్లడించారు. జిల్లా ప్రజల సహకారంతో కార్యక్రమాన్ని మరింత విజయవంతంగా ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో అంబాదాస్ రాజేశ్వర్, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు,  హెచ్ కె ఎం సి ఎఫ్ సీఈఓ కౌంతేయదాస ప్రభుజీ, పీఆర్ ఇన్‌చార్జి శ్రీ రవిలోచన దాస ప్రభుజీ, మున్సిపల్ చైర్మన్ రాధిక భూపతి రాజు, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.