A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 14 September 2026, 8:14 am Posted by : A2TV NEWS

విఘ్నేశ్వరుని కృపతో జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి

గణేష్ చతుర్థిని భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి: కలెక్టర్ ప్రతిమాసింగ్

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 14:

మెదక్ జిల్లా (13) గణేష్ చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలందరికీ జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుని కృపతో ప్రజల జీవితాల్లోని విఘ్నాలన్నీ తొలగిపోయి, ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆమె ఆకాంక్షించారు. జిల్లా ప్రజలందరూ గణేష్ చతుర్థి పండుగను భక్తిశ్రద్ధలతో, సంతోషంగా జరుపుకోవాలని కలెక్టర్ కోరారు. గణపతి ఆశీర్వాదాలతో జిల్లాలో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, శాంతి వెల్లివిరియాలని, ప్రజల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలని ఆకాంక్షించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణేష్ విగ్రహాలను వినియోగించాలని కలెక్టర్ సూచించారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను నివారించి, నిమజ్జనం కారణంగా నీటి కాలుష్యం జరగకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. గణేష్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ప్రజలు స్వచ్ఛత, క్రమశిక్షణ పాటిస్తూ ప్రభుత్వానికి సహకరించాలని ఆమె సూచించారు. నిమజ్జనం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాంతాల్లోనే విగ్రహాలను నిమజ్జనం చేయాలని తెలిపారు. ప్రజలందరూ ఐకమత్యంతో, పరస్పర సహకారంతో, ప్రశాంత వాతావరణంలో గణేష్ చతుర్థి వేడుకలను నిర్వహించుకోవాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ పిలుపునిచ్చారు.