A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 06 August 2026, 7:08 am Posted by : A2TV NEWS

సైబర్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి

నకిలీ స్టాక్‌ మార్కెట్‌ ప్రకటనలను నమ్మొద్దు – ఉద్యోగాల పేరుతో డబ్బులు అడిగితే జాగ్రత్త

విద్యార్థులు సైబర్‌ నేరాలపై అవగాహన పెంచుకోవాలి: మెదక్‌ ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 6:

మెదక్‌ జిల్లా (5) సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ సైబర్‌ నేరాలు కూడా కొత్త రూపాల్లో పెరుగుతున్నాయని, ప్రజలు డిజిటల్‌ ప్రపంచంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని మెదక్‌ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు సూచించారు. జాతీయ ‘సైబర్‌ జాగృత్‌ దివస్‌’ సందర్భంగా తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘సురక్షా కా తిరంగా–సైబర్‌ స్వతంత్ర తెలంగాణ’ కార్యక్రమంలో భాగంగా బుధవారం మెదక్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన సైబర్‌ అవగాహన కార్యక్రమంలో ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో ప్రతిరోజూ సైబర్‌ నేరాల వల్ల ప్రజలు కోట్ల రూపాయలు కోల్పోతున్నారని ఆయన తెలిపారు. సోషల్‌ మీడియాలో కనిపించే నకిలీ స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడి ప్రకటనలను నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. మోసగాళ్లు ముందుగా వాట్సాప్‌ గ్రూపుల్లో చేర్చి, కొందరు భారీ లాభాలు పొందినట్లు నకిలీ స్క్రీన్‌షాట్లు, సందేశాలు పంపిస్తూ ప్రజలను ఆకర్షిస్తారని చెప్పారు. తొలుత కొంత లాభం వచ్చినట్లు చూపించి, తర్వాత భారీ పెట్టుబడులు పెట్టించి మోసాలకు పాల్పడుతున్నారని వివరించారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రిజిస్ట్రేషన్‌, ప్రాసెసింగ్‌, సెక్యూరిటీ డిపాజిట్‌ వంటి పేర్లతో డబ్బులు అడిగితే అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. ఒకసారి డబ్బులు చెల్లించిన తర్వాత మరో ఫీజు, ఇంకో ఫీజు అంటూ వరుసగా వసూలు చేస్తారని, చివరకు భారీ మొత్తంలో నష్టం జరిగిన తర్వాతే బాధితులకు మోసం తెలిసివస్తుందని తెలిపారు. ఉద్యోగం ఇచ్చే సంస్థ అభ్యర్థికి జీతం చెల్లిస్తుందని, ఉద్యోగం ఇవ్వడానికి అభ్యర్థి నుంచి డబ్బులు ఎందుకు అడుగుతుందో ఆలోచించాలని సూచించారు.బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు, పాస్‌వర్డ్‌లు, ఏటీఎం లేదా డెబిట్‌ కార్డు వివరాలు వంటి వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని ఎస్పీ హెచ్చరించారు. అలాగే సోషల్‌ మీడియాలో వచ్చే ఫేక్‌ అకౌంట్లు, ఫిషింగ్‌ లింకులు, తప్పుడు ప్రచారాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. సైబర్‌ మోసానికి గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేయడంతో పాటు National Cyber Crime Reporting Portalలో ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు. విద్యార్థులు సైబర్‌ భద్రతపై అవగాహన పెంచుకోవడంతో పాటు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులకు కూడా సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించాలని ఎస్పీ పిలుపునిచ్చారు. ప్రతి పౌరుడు బాధ్యతాయుతమైన డిజిటల్‌ పౌరుడిగా వ్యవహరించినప్పుడే ‘సైబర్‌ స్వతంత్ర తెలంగాణ’ లక్ష్యం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులతో సైబర్‌ అవగాహనా ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ విక్రాంత్‌ కుమార్‌ సింగ్‌, ఐపీఎస్‌, డీఎస్పీలు సుభాష్‌ చంద్రబోస్‌, ప్రసన్నకుమార్‌, కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ కే. హుస్సేన్‌, డా. టి. మల్లేశం, వి. మురళి, డాక్టర్‌ ఆర్‌. శ్రీలత, సైబర్‌ క్రైమ్‌ సిబ్బంది సతీష్‌, సయ్యద్‌, సాయికిరణ్‌, స్వప్న తదితరులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.