A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 29 July 2026, 6:19 am Posted by : A2TV NEWS

సైబర్‌ నేరాల నివారణకు అవగాహనే ఆయుధం

పేకాట, బెట్టింగ్‌పై ఉక్కుపాదం – సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలకు చైతన్యం కల్పించాలి

వెల్దుర్తి పోలీస్‌స్టేషన్‌లో అదనపు ఎస్పీ విక్రాంత్‌కుమార్‌ సింగ్ ఆకస్మిక తనిఖీ

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) జూలై 29:

వెల్దుర్తి (28) ప్రజలకు పోలీసులపై నమ్మకం పెరిగేలా ప్రతి పోలీసు అధికారి బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని మెదక్ జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్‌కుమార్‌ సింగ్, ఐపీఎస్‌ సూచించారు. మంగళవారం ఆయన వెల్దుర్తి పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి స్టేషన్‌లోని రికార్డులు, వివిధ రిజిస్టర్లు, కేసు డైరీలు, పెండింగ్ కేసుల వివరాలను పరిశీలించారు. కేసుల దర్యాప్తు పురోగతిపై సిబ్బందిని అడిగి తెలుసుకున్న అదనపు ఎస్పీ, పెండింగ్ కేసులను నిబంధనల ప్రకారం త్వరితగతిన పూర్తి చేయాలని ఎస్‌ఐ కర్ణాకర్‌రెడ్డికి ఆదేశించారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌ ఆవరణ, లాకప్‌ గదులు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందితో సమావేశమయ్యారు. స్థానిక శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించిన ఆయన, నేరాల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని, శాంతిభద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. పేకాట, ఆన్‌లైన్‌ గేమింగ్‌, బెట్టింగ్‌ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని, నిర్వాహకులతో పాటు పాల్గొనే వారిపైనా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించాలని, సైబర్‌ నేరాల నివారణకు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల నేరాల నియంత్రణతో పాటు దర్యాప్తులో కీలక ఆధారాలు లభిస్తాయని పేర్కొంటూ వాటి ప్రాముఖ్యతపై ప్రజలకు చైతన్యం కల్పించాలని సూచించారు. ట్రాఫిక్‌ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించి రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని, పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితుల సమస్యలను ఓపికగా విని వెంటనే స్పందించాలని ఆదేశించారు. ప్రతి ఫిర్యాదుపై పారదర్శకంగా విచారణ జరిపి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ పోలీసులపై విశ్వాసం పెంచే విధంగా సేవలందించాలని అదనపు ఎస్పీ విక్రాంత్‌కుమార్‌ సింగ్ సూచించారు.