ఐదుగురు అరెస్టు.11,230 నగదు, ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం
A2 న్యూస్, జూన్ 28, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)
మెదక్ (27): శివ్వంపేట మండలం గంగాయిపల్లి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై మెదక్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆకస్మికంగా దాడి నిర్వహించి ఐదుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.11,230 నగదు, ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం నిర్వహించిన ఈ దాడిలో ఇటిక్యాల రేవంత్ రెడ్డి, బానోత్ కంద్యా, నల్ల పేరమాన్లు, జిట్ట సత్యనారాయణ, ఎ. ప్రశాంత్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టారు.
ఈ సందర్భంగా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ, జిల్లాలో జూదం, పేకాట వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై నిరంతర నిఘా కొనసాగుతోందని తెలిపారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే అక్రమ కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే, తమ పరిసరాల్లో జరుగుతున్న అక్రమ కార్యకలాపాలపై ప్రజలు పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.