A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 02 September 2026, 6:19 am Posted by : A2TV NEWS

పోలీసుల సంక్షేమానికి మరో ముందడుగు..

మెదక్ జిల్లాలో పోలీస్ క్యాంటీన్‌కు అడుగులు

అసోసియేషన్ విజ్ఞప్తికి ఎస్పీ సానుకూల స్పందన.. ఏర్పాట్ల బాధ్యతలు అధికారులకు అప్పగింత

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 2:

మెదక్ (1) జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మెదక్ జిల్లాలో పోలీస్ క్యాంటీన్ ఏర్పాటుకు చర్యలు ప్రారంభమయ్యాయి. జిల్లా పోలీస్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యుల విజ్ఞప్తికి జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు సానుకూలంగా స్పందించడంతో క్యాంటీన్ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఇటీవల ఎన్నికైన మెదక్ జిల్లా పోలీస్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు తొలుత జిల్లా అడిషనల్ ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, ఐపీఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావును కలిసి పోలీసు అధికారులు, సిబ్బంది సౌకర్యార్థం జిల్లాలో ప్రత్యేకంగా పోలీస్ క్యాంటీన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. పోలీసు సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అసోసియేషన్ ప్రతిపాదనపై ఎస్పీ సానుకూలంగా స్పందించారు. క్యాంటీన్ ఏర్పాటుకు సంబంధించి ఉన్నతాధికారులతో సంప్రదించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.క్యాంటీన్ ఏర్పాటుకు సంబంధించి అవసరమైన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే బాధ్యతలను సీఐ సందీప్‌రెడ్డి, ఆర్‌ఐ శైలేందర్‌కు ఎస్పీ అప్పగించారు. దీంతో జిల్లాలో పోలీస్ క్యాంటీన్ ఏర్పాటుకు సంబంధించి కార్యాచరణ ప్రారంభమైంది. పోలీసు సిబ్బందికి అవసరమైన నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండేలా క్యాంటీన్ ఏర్పాటు చేయడం ద్వారా వారికి మరింత సౌకర్యం కలుగుతుందని పోలీస్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఎస్పీ సానుకూల స్పందనతో పోలీస్ సిబ్బందిలో హర్షం వ్యక్తమవుతోందని పేర్కొన్నారు.