A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 11 July 2026, 5:34 am Posted by : A2TV NEWS

అధికారాల దుర్వినియోగం ఆరోపణలు.. పోలంపల్లి సర్పంచ్ ఆరు నెలల పాటు సస్పెన్షన్

A2న్యూస్, జులై 11, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

చేగుంట (10) మెదక్ జిల్లా చేగుంట మండలం పోలంపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ శ్రీమతి కొండి రాజ్యలక్ష్మిని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం–2018లోని సెక్షన్ 37(1)(ii), (iii), (iv) మరియు సెక్షన్ 37(5) ప్రకారం ఆరు నెలల పాటు తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం, తూప్రాన్ డివిజనల్ పంచాయతీ అధికారి సమర్పించిన విచారణ నివేదికలో గ్రామపంచాయతీ పరిధిలో హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలను సర్పంచ్ భర్త శ్రీ కొండి స్వామి నరికివేయడం, గ్రామపంచాయతీ ఫర్నిచర్ ధ్వంసం చేయడం, ఎలాంటి అనుమతులు లేకుండా గ్రామపంచాయతీ మరుగుదొడ్లను కూల్చివేయడం, గ్రామపంచాయతీ కార్యాలయానికి తాళం వేయడం వంటి ఆరోపణలు నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా, గ్రామపంచాయతీ పాలకవర్గ సమావేశాల్లో సర్పంచ్ భర్త పాల్గొనడం, సర్పంచ్ అధికారాలను ఆయనే వినియోగిస్తున్నట్లు విచారణలో తేటతెల్లమైనట్లు కలెక్టర్ తెలిపారు. ఈ అంశాలన్నింటినీ పరిశీలించిన అనంతరం, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం–2018 ప్రకారం సర్పంచ్ తన అధికారాలను దుర్వినియోగం చేశారని, విధుల నిర్వహణలో చెడు నడవడిక ప్రదర్శించారని నిర్ధారణ కావడంతో శ్రీమతి కొండి రాజ్యలక్ష్మిని ఆరు నెలల పాటు తాత్కాలికంగా సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. సస్పెన్షన్ కాలంలో శ్రీమతి కొండి రాజ్యలక్ష్మికి సర్పంచ్ పదవికి సంబంధించిన అధికారాలు వినియోగించే హక్కు ఉండదని, విధులు నిర్వహించడానికి అర్హత ఉండదని స్పష్టం చేశారు. అలాగే, అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన సమావేశం మినహా గ్రామపంచాయతీ సమావేశాల్లో పాల్గొనే అర్హత కూడా ఉండదని తెలిపారు.