A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 20 September 2026, 7:11 am Posted by : A2TV NEWS

మెదక్ టౌన్‌లో భద్రతా ఏర్పాట్లపై అదనపు ఎస్పీ పరిశీలన

నిమజ్జనంలో భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్

నిర్వాహకులు పోలీసులకు పూర్తి సహకారం అందించాలి

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 20:

మెదక్ జిల్లా (19) గణేష్ నిమజ్జన కార్యక్రమం నేపథ్యంలో మెదక్ టౌన్‌లో చేపట్టిన భద్రతా ఏర్పాట్లను జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ శనివారం పరిశీలించారు. పట్టణంలోని పలు గణేష్ మండపాలను సందర్శించిన ఆయన, నిర్వాహకులతో మాట్లాడి నిమజ్జనం సందర్భంగా పాటించాల్సిన భద్రతా నిబంధనలు, తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. నిమజ్జన ఊరేగింపులో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉన్నందున నిర్వాహకులు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని అదనపు ఎస్పీ సూచించారు. గణేష్ విగ్రహాలను తరలించే వాహనాలపై పరిమితికి మించి వ్యక్తులు ఎక్కకుండా చూడాలని, డ్రైవర్లు అప్రమత్తంగా వాహనాలు నడపాలని తెలిపారు. డీజేలు, లౌడ్‌స్పీకర్ల వినియోగంపై అమల్లో ఉన్న నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. పిల్లలు, మహిళలు, వృద్ధుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, విద్యుత్ తీగలు, ట్రాఫిక్ రద్దీ తదితర అంశాలపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. పోలీసుల సూచనలను పాటిస్తూ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. అనంతరం గణేష్ విగ్రహాల నిమజ్జనానికి వెళ్లే ప్రధాన మార్గాలను అదనపు ఎస్పీ పరిశీలించారు. రహదారుల పరిస్థితి, ట్రాఫిక్ నియంత్రణ, బారికేడింగ్, లైటింగ్ తదితర ఏర్పాట్లను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. నిమజ్జన మార్గాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా నిర్వాహకులు, ప్రజలు, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేయాలని అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్న కుమార్, మెదక్ టౌన్ ఇన్‌స్పెక్టర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.