A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 26 August 2026, 5:50 am Posted by : A2TV NEWS

ప్రమాద రహిత రహదారులే లక్ష్యం

ప్రజల ప్రాణరక్షణకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి: కలెక్టర్ ప్రతిమా సింగ్

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) ఆగస్టు 26 :

మెదక్ జిల్లా (25) ప్రమాద రహిత రహదారుల లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. మంగళవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణపై సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గత సమావేశంలో చర్చించిన అంశాలపై అధికారులు తీసుకున్న చర్యలను కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలోని బ్లాక్ స్పాట్స్ వివరాలు, పీఎం రాహత్, పీఎం రహవీర్ పథకాల అమలు, రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల ప్రాణాలను కాపాడటం అధికారుల తక్షణ కర్తవ్యమని, ఈ విషయంలో చిత్తశుద్ధితో పనిచేయాలని అన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు సకాలంలో వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రధానమంత్రి రాహత్ పథకం కింద రోడ్డు ప్రమాద బాధితులకు గోల్డెన్ అవర్‌లో రూ.1.50 లక్షల వరకు క్యాష్‌లెస్ చికిత్స అందించే అంశంపై అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రమాదం జరిగిన ఏడు రోజుల్లోపు దరఖాస్తు చేసుకునే వారికి సంబంధిత ఎస్‌హెచ్‌ఓ సహకారంతో ఎఫ్‌ఐఆర్ కాపీతో దరఖాస్తు చేసుకునే విధానాన్ని వివరించారు. అలాగే పీఎం రహవీర్ పథకం కింద రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ సహాయం అందించిన వారికి రూ.25 వేల వరకు రివార్డు పొందేందుకు దరఖాస్తు చేసుకునే విధానంపై కూడా సమావేశంలో చర్చించారు.రోడ్డు ప్రమాదాల నివారణకు భద్రతా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించి అవసరమైన భద్రతా చర్యలు చేపట్టడంతో పాటు, ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంచాలని సూచించారు. సమన్వయంతో పనిచేసి మెదక్ జిల్లాను ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని అధికారులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆర్‌అండ్‌బీ ఈఈ శంకర్, నేషనల్ హైవే 765 డీజీ కరుణాకర్ రెడ్డి, డీఎస్పీ ప్రసన్నకుమార్, డీటీఓ శ్రీకాంత్ చక్రవర్తి, ఎస్‌బీసీఐ సందీప్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, ఇంటర్మీడియట్ అధికారి మాధవి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.