A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 27 September 2026, 6:29 am Posted by : A2TV NEWS

మెదక్ టూరిజం అభివృద్ధిలో కలెక్టర్ ప్రతిమా సింగ్‌కు అరుదైన గౌరవం

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేతుల మీదుగా ప్రతిష్టాత్మక అవార్డు

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 27:

మెదక్ జిల్లా (26) పర్యాటక రంగ అభివృద్ధిలో విశేష కృషి చేసినందుకు మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్‌కు ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ శిల్పారామంలో రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఆమెకు “ఉత్తమ పర్యాటక ప్రతిభ అవార్డు” ప్రదానం చేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరై కలెక్టర్ ప్రతిమా సింగ్‌కు అవార్డును అందజేసి ఘనంగా సత్కరించారు. మెదక్ జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధి, చారిత్రక కట్టడాల సంరక్షణ, పర్యాటకులకు మెరుగైన వసతుల కల్పనలో జిల్లా యంత్రాంగం చేసిన కృషిని గుర్తిస్తూ ఈ పురస్కారం అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. జిల్లాల్లో పర్యాటక ప్రాంతాలను గుర్తించి వాటిని పర్యాటక హబ్‌లుగా అభివృద్ధి చేయడంలో మెదక్ జిల్లా కలెక్టర్ తీసుకున్న చొరవను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్‌లో మరిన్ని వినూత్న కార్యక్రమాలతో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలని సూచించారు.

అవార్డు స్వీకరించిన కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. ఉప ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రతిష్టాత్మక పురస్కారం అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ అవార్డు సాధనలో జిల్లా పర్యాటక శాఖ అధికారులు, సిబ్బంది, మీడియా, ప్రజల సహకారం ఎంతో ఉందని పేర్కొన్నారు. ఈ పురస్కారం తమపై మరింత బాధ్యతను పెంచిందని, భవిష్యత్‌లో మెదక్ జిల్లాలో పర్యాటక అభివృద్ధికి మరింత కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పర్యాటక శాఖ సెక్రటరీ వాణి ప్రసాద్‌తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు, పర్యాటక రంగ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.