A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 24 July 2026, 7:09 am Posted by : A2TV NEWS

సైబర్‌ నేరాల నియంత్రణకు సమష్టిగా కృషి చేయాలి

బాధితులకు నగదు త్వరగా అందేలా చర్యలు: డీజీపీ సీవీ ఆనంద్‌

సైబర్‌ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మెదక్‌ ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు

A2న్యూస్, జూలై 24, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము)

మెదక్‌ జిల్లా (23)  సైబర్‌ నేరాల నియంత్రణకు పోలీసు శాఖ అన్ని స్థాయిల్లో పటిష్ట చర్యలు చేపట్టడంతో పాటు, సైబర్‌ మోసాలకు గురై నగదు కోల్పోయిన బాధితులకు త్వరితగతిన డబ్బు తిరిగి అందేలా సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ ఆదేశించారు. గురువారం రాష్ట్రంలోని పోలీస్‌ కమిషనర్లు, జిల్లా ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సైబర్‌ నేరాల నియంత్రణ, ప్రజల్లో అవగాహన, బాధితులకు నగదు రిఫండ్‌ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. మెదక్‌ జిల్లా పోలీస్‌ కార్యాలయం నుంచి అదనపు ఎస్పీ విక్రమ్‌ కుమార్‌ సింగ్‌, సైబర్‌ క్రైమ్‌ డీఎస్పీ సుభాష్‌ చంద్రబోస్‌, సీఐలు రాజశేఖర్‌ రెడ్డి, జర్జ్‌, సైబర్‌ క్రైమ్‌ సిబ్బంది, ఐటీ కోర్‌ సిబ్బంది వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. సైబర్‌ మోసాల్లో బాధితులు కోల్పోయిన నగదు త్వరగా తిరిగి వచ్చేలా బ్యాంకులు, కోర్టులతో పోలీసులు సమన్వయంగా పనిచేయాలని డీజీపీ సూచించారు. సైబర్‌ నేరాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు. గతంలో నక్సలిజం వంటి సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న పోలీసు శాఖ, ప్రస్తుతం సైబర్‌ నేరాలు, డ్రగ్స్‌ వినియోగం, ఆహార కల్తీ, రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మెదక్‌ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ, జిల్లాలో సైబర్‌ మోసాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సైబర్‌ నేరాలపై నిరంతర నిఘా కొనసాగుతోందని, ప్రతి పోలీస్‌స్టేషన్‌లో సైబర్‌ వారియర్స్‌ను అందుబాటులో ఉంచి ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నామని చెప్పారు. ప్రజలను మోసాలకు గురిచేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రజలు తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు

బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ, పిన్‌, సీవీవీ, పాస్‌వర్డ్‌లను అపరిచితులతో పంచుకోవద్దు.

ఫోన్‌, ఎస్‌ఎంఎస్‌, వాట్సాప్‌, ఈ-మెయిల్‌ ద్వారా వచ్చే అనుమానాస్పద లింకులను క్లిక్‌ చేయవద్దు.

అధిక లాభాలు వస్తాయని చెప్పే ఆన్‌లైన్‌ పెట్టుబడి పథకాలను నమ్మవద్దు.

నకిలీ సోషల్‌ మీడియా ఖాతాల ద్వారా వచ్చే డబ్బు అభ్యర్థనలకు స్పందించవద్దు.

తక్కువ ధరలకు వస్తువులు ఇస్తామంటూ ముందస్తు నగదు కోరే ప్రకటనలను నమ్మవద్దు.

లక్కీడ్రా, ఉచిత బహుమతులు, రివార్డుల పేరుతో వచ్చే లింకులను తెరవవద్దు.

AnyDesk, TeamViewer వంటి రిమోట్‌ యాక్సెస్‌ యాప్‌లను తెలియని వ్యక్తుల సూచనతో ఇన్‌స్టాల్‌ చేయవద్దు.

డబ్బులు స్వీకరించేందుకు QR కోడ్‌ స్కాన్‌ చేయాల్సిన అవసరం లేదని గుర్తుంచుకోవాలి.

పబ్లిక్‌ వైఫై ద్వారా బ్యాంకింగ్‌ లావాదేవీలు నిర్వహించవద్దు.

ఆధార్‌, పాన్‌, పుట్టిన తేదీ వంటి వ్యక్తిగత వివరాలను సోషల్‌ మీడియాలో బహిరంగంగా ఉంచవద్దు.

విద్యుత్‌ బిల్లు, సిమ్‌ బ్లాక్‌, పార్సిల్‌లో డ్రగ్స్‌ పేరుతో వచ్చే బెదిరింపు కాల్స్‌ను నమ్మవద్దు.

సోషల్‌ మీడియాలో కనిపించే అతి తక్కువ ధరల ఆన్‌లైన్‌ ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

సైబర్‌ మోసానికి గురైన వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్‌ చేసి ఫిర్యాదు చేయాలని మెదక్‌ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ప్రజలకు సూచించారు.