Sunday, September 13, 2026
Homeమెదక్కోతుల బెడదకు చెక్‌.. ఉద్యమంలా నివారణ చర్యలు

కోతుల బెడదకు చెక్‌.. ఉద్యమంలా నివారణ చర్యలు

📰 Generate e-Paper Clip

జిల్లాలో 6,500 కోతులు ఉన్నట్లు అంచనా.. మున్సిపల్ కమిషనర్లకు కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశాలు

A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 12:

మెదక్ జిల్లా (11) కోతుల బెడదతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు, రైతులకు ఉపశమనం కల్పించేలా పటిష్టమైన చర్యలు చేపట్టాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. కోతుల నియంత్రణ కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన, ఉద్యమంలా చేపట్టాలని సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి నర్సాపూర్, తూప్రాన్, మెదక్ మున్సిపల్ కమిషనర్లతో గూగుల్ మీట్ ద్వారా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. గత సమావేశంలో సూచించిన అంశాలపై ఇప్పటివరకు తీసుకున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో సుమారు 6,500 కోతులు ఉన్నట్లు మున్సిపల్ కమిషనర్లు నివేదికలు రూపొందించినట్లు కలెక్టర్ తెలిపారు. మెదక్‌లో సుమారు 3,000, నర్సాపూర్‌లో 2,000, తూప్రాన్‌లో 1,000, రామాయంపేటలో 500 కోతులు ఉన్నట్లు అంచనా వేసినట్లు వెల్లడించారు. కోతుల బెడద నివారణలో భాగంగా కోతులను పట్టుకుని నిర్మల్ జిల్లాకు తరలించి, అక్కడ అవసరమైన ఆపరేషన్ అనంతరం వాటిని అదే జిల్లాలో వదిలే విధంగా చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ చర్యల ద్వారా ప్రజలు, రైతులకు కోతుల బెడద నుంచి గణనీయమైన ఉపశమనం లభిస్తుందని పేర్కొన్నారు. కోతుల నియంత్రణ కార్యక్రమాన్ని దశలవారీగా ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తే సమస్యను గణనీయంగా నియంత్రించవచ్చని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. ఇందుకు ప్రజలు, రైతులు, అధికారులు సహకరించాలని కోరారు. మెదక్ జిల్లాను కోతుల నియంత్రణలో ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దేందుకు సమష్టిగా కృషి చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమీక్షలో అదనపు కలెక్టర్ నగేష్, డీఎఫ్‌ఓ జోజి, డీపీఓ యాదయ్య, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install A2TV News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!