అధికారులకు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశం
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 11:
మెదక్: సెప్టెంబర్ 17న నిర్వహించనున్న ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావుతో కలిసి వివిధ శాఖల జిల్లా అధికారులతో వేడుకల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్వహించనున్న ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేయాలని సూచించారు. వేదిక, ప్రొటోకాల్ ప్రకారం సీటింగ్ ఏర్పాట్లు సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ పతాకావిష్కరణ సమయంలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
వేడుకలకు హాజరయ్యే ప్రజలు, అధికారులు, ప్రభుత్వ సిబ్బందికి తాగునీటితో పాటు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించాలని తెలిపారు. ప్రజలు అధిక సంఖ్యలో హాజరై ప్రజాపాలన దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు. వివిధ శాఖల అధికారులు తమ కార్యాలయ సిబ్బందితో కలిసి తప్పనిసరిగా కార్యక్రమానికి హాజరు కావాలని సూచించారు.
జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు పోలీస్ గౌరవ వందనం, బందోబస్తు విషయంలో పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమం ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో డీఆర్వో అంబదాస్ రాజేశ్వర్, ఆర్డీఓ రమాదేవి, డీఎఫ్‌ఓ జోజి, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ పీడీ శ్రీనివాసరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

