జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఎఫ్ఏసీ సెక్రెటరీ ఆర్. సిరి సౌజన్య
A2న్యూస్, మెదక్ జిల్లా ప్రతినిధి (రాము) సెప్టెంబర్ 6:
మెదక్ జిల్లా (5) ఈ నెల 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను ప్రజలు, కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఎఫ్ఏసీ సెక్రెటరీ ఆర్. సిరి సౌజన్య పిలుపునిచ్చారు. శనివారం మెదక్ జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. న్యాయస్థానాల్లో ఏళ్ల తరబడి కేసులు కొనసాగిస్తూ సమయం, ధనం వృథా చేసుకోవడం కంటే పరస్పర అంగీకారంతో సమస్యలను పరిష్కరించుకోవడం ద్వారా ఇరుపక్షాలకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. రాజీ మార్గం ద్వారా కేసులను త్వరితగతిన పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. ప్రజలకు సత్వర, సులభ, తక్కువ ఖర్చుతో చట్టబద్ధమైన న్యాయం అందించడమే జాతీయ లోక్ అదాలత్ ప్రధాన లక్ష్యమన్నారు. ఈ నేపథ్యంలో కక్షిదారులు లోక్ అదాలత్ను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. జాతీయ లోక్ అదాలత్లో పెండింగ్లో ఉన్న సివిల్ కేసులతో పాటు భూసేకరణ, మున్సిపల్, ఇన్సూరెన్స్, బ్యాంకు తదితర కేసులను కూడా రాజీ ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉందని తెలిపారు. ఎలాంటి అదనపు ఖర్చులు లేకుండా సత్వర న్యాయం పొందేందుకు లోక్ అదాలత్ మంచి వేదికగా ఉపయోగపడుతుందని ఆర్. సిరి సౌజన్య వివరించారు.

