A2TVNEWS.COM
Newspaper Banner
Date of Publish : 14 June 2026, 9:18 pm Posted by : A2TV NEWS

విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ప్రభుత్వ పాఠశాలలు ప్రతీక ప్రైవేట్ బడులకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య – జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

 

మెదక్ జిల్లా ప్రతినిధి(రాము)

మెదక్, జూన్ 14: విద్యార్థినీ, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ప్రభుత్వ పాఠశాలలు ప్రతీకలుగా నిలుస్తున్నాయని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. పాఠశాలల పునఃప్రారంభం నేపథ్యంలో విద్యా శాఖ సమగ్ర ప్రణాళికతో ఏర్పాట్లు పూర్తి చేసి పటిష్టంగా అమలు చేస్తున్నట్లు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. జిల్లాలో సోమవారం నుంచి మొత్తం 1,037 పాఠశాలలు పునఃప్రారంభమవుతున్నాయని, అందులో 928 ప్రభుత్వ పాఠశాలలు, 109 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 83 వేల మంది, ప్రైవేట్ పాఠశాలల్లో 43 వేల మంది, మొత్తం 1.26 లక్షల మంది విద్యార్థులు బడిబాట పట్టనున్నట్లు వెల్లడించారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు కొత్త పాఠ్యపుస్తకాలు, విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా మొదటి రోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఒకటో తరగతిలో చేరే చిన్నారులకు ప్రత్యేక స్వాగత కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం, మధ్యాహ్న భోజన ఏర్పాట్లు, పరిశుభ్రమైన వాతావరణం పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. పాఠశాల పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థినీ, విద్యార్థులు నూతన ఉత్సాహంతో తరగతి గదుల్లోకి అడుగుపెట్టి క్రమశిక్షణతో చదువుకుని ఉజ్వల భవిష్యత్తును సొంతం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. అలాగే విద్యార్థుల జీవితాలకు మార్గదర్శకులుగా నిలుస్తున్న ఉపాధ్యాయులందరికీ శుభాభినందనలు తెలిపారు. కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన, గుణాత్మక విద్య అందుబాటులో ఉందని పేర్కొంటూ, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. హాజరు శాతం పెంపుతో పాటు డిజిటల్ బోధనకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ విద్యా సంవత్సరాన్ని ప్రారంభిస్తున్న ఈ సందర్భంగా ప్రతి పాఠశాల సామరస్యంతో, క్రమశిక్షణతో, విజయాలతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆకాంక్షించారు.